పరిచయం :
మీరు ఒకసారి ఊహించుకోండి మీకు తెలిసిన మీ స్నేహితుని కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుందాం అతనికి వృద్ధ తల్లిదండ్రులు మరియు భార్య స్కూల్ కి వెళ్ళే ఒక నాలుగు సంవత్సరాల పాప,పాలు తాగే వయస్సులో ఉన్నచిన్న బాబు ఉన్నాడు అనుకుందాం.అనుకోని పరిస్థితిలో మీ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అనుకుందాం? అప్పుడు ఆ కుటుంభ పరిస్థితి ఏంటి? ఇకనుండి అతని భార్య పిల్లల్ని పోషించేది ఎవరు ? ఆ వృద్ధ తల్లిదండ్రులకు మందులు కొనిచ్చి వారి యోగ క్షేమాలు చూసే వారెవరు ? అలాంటి సందర్భంలో ఆ కుటుంబానికి మీ స్నేహితుడు లేని లోటు ఎటూ తీర్చలేనిది కానీ ఆర్థిక పరమైన సమస్యలనుండి ఆ కుటుంబాన్ని కాపాడుకోవటానికి “ టర్మ్ పాలసీ ” తీసుకున్నట్లయితే వారి కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్ధిక ప్రయోజం అందించబడుతుంది. ఎప్పటిలాగే తన పిల్లల పోషణ,తల్లిదండ్రుల బాధ్యతలు టర్మ్ పాలసీ అందించే ఆర్ధిక పరిహారంతో నెరవేరుతాయి కావున టర్మ్ పాలసీ ప్రతి ఒక్కరు తీసుకోవాలని బీమా నిపుణులు చెపుతుంటారు.
టర్మ్ పాలసీ రకాలు :
టర్మ్ పాలసీ అనగా ఒక నిర్దిష్ట కాలం నుండి నిర్దిష్ట కాలం వరకు పాలసీదారునికి జీవిత బీమా రక్షణను అందిస్తాయి. తక్కువ ప్రీమియంతో అత్యంత ఎక్కువగా కవరేజ్ అందిస్తున్న టర్మ్ పాలసీలు మొత్తంగా 3 రకాలుగా ఉంటాయి. అవి
1 ఫ్యూర్ టర్మ్ పాలసీ
2 టర్మ్ రిటర్న్ పాలసీ (TROP)
3 జీరో కాస్ట్ టర్మ్ పాలసీ
వీటన్నింటిని గురించి మరియు వాటి మధ్య గల బేధాలు ,వాటి ఉపయోగాల గురించి తెల్సుకుందాం.
1 ఫ్యూర్ టర్మ్ పాలసీ
బీమా పాలసీలన్నింటిలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాథమికమైనది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణను అందిస్తుంది. అందుకే దీన్ని “ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్” అంటారు. పాలసీ వ్యవధిలో బీమా దారుడు అకాల మరణం చెందినట్లయితే వారి కుటుంబానికి బీమా కవరేజ్ అందిస్తుంది.ఒకేవేళ పాలసీదారుడు మరణించని యెడల ఈ పాలసీ ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అనగా పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం ఈ పాలసీలో ఎటువంటి ప్రయోజనాలను పొందడు. తాను కట్టిన ప్రీమియం లకు కేవలం మరణం సంభవిస్తేనే పాలసీ హామీ మేరకు మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది. పాలసీలో పేర్కొన్న పూర్తి కాలం పాలసీదారుడు జీవించిన ఎటువంటి మెచూరిటీ చెల్లించబడదు. అయితే కొన్ని రైడర్లు ఎంచుకోవడం వల్ల క్రిటికల్ ఇల్నెస్ యాక్సిడెంట్ డిసబులిటీ.టర్మినల్ ఇల్ నెస్ లాంటి ప్రయోజనాలను తాను జీవించి ఉండగానే పొందవచ్చు. ఈ పాలసీ యొక్క విశేషం ఏంటంటే మిగతా రెండు టర్మ్ పాలసీలతో పోల్చుకుంటే ఈ పాలసీ అత్యంత తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఉంటుంది.
ప్యూర్ టర్మ్ పాలసీని ఈ ఉదాహరణల ద్వారా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
సందర్భం 1 –
రాము అనే 30 సంవత్సరాల యువకుడు ఒక బీమా సంస్థ నుండీ కోటి రూపాయలకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని సంవత్సరానికి 30 వేల ప్రీమియంతో తను 70 సంవత్సరాల వరకు లైఫ్ కవర్ తీసుకోవటం జరిగింది. దురదృష్టవశాత్తు తన 40 వ ఏట రాము రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అప్పుడు బీమా సంస్థ రాము కుటుంబానికి కోటి రూపాయల బీమా చెల్లించడం జరిగింది. దీంతో వారి కుటుంబానికి బీమా పాలసీ ఏంతో అండగా నిలిచింది.
సందర్భం 2 –
సందర్భం 1 లో వివరించినట్టు రాము తన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ 1కోటి లైఫ్ కవర్ కోసం 30 ఏట నుండి తన 70 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 30 వేల ప్రీమియంలు కడుతూ వచ్చాడు. అదృష్టం కొద్ది రాము తన పాలసీ ఆసాంతం జీవించి ఉండటం జరిగింది.రాముకి ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తి అవటం వలన తన టర్మ్ పాలసీ ముగిసింది. ఈ పరిస్థితుల్లో రాముకు తన పాలసీ నుండి ఒక్క రూపాయి కూడా రాదు.
2 టర్మ్ రిటర్న్ పాలసీ (TROP)
ప్రీమియం రిటర్న్ టర్మ్ పాలసీలో (TROP ) జీవిత బీమా కవరేజ్ తో పాటు మెచూరిటీ ప్రయోజనాలు అందించబడుతాయి అంటే పాలసీదారుడు అకాల మరణం చెందితే వారి కుటుంబానికి జీవిత బీమా అందించ బడుతుంది ఒకవేళ జీవించి వున్నట్లయితే పాలసీ మెచూరిటీ ప్రయోజనం చెల్లించబడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ లాగే ఈ పాలసీలో కూడా రైడర్ ప్రయోజనాలను పొందవచ్చు, కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ కి దీనికి గల తేడా ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో పాలసీదారుడు జీవించిఉన్న యెడల ప్రీమియం వెనక్కి రాదు ,కానీ ఇందులో జీవించి ఉన్న కూడా తాను కట్టినా ప్రీమియం లన్నింటినీ మెచ్యూరిటీ రూపంలో GST ని మినహాయించుకుని తిరిగి పొందటం జరుగుతుంది .కానీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంతో పోల్చుకుంటే ఈ పాలసీలో ప్రీమియం చాలా అధికంగా ఉంటుంది. ప్రీమియం పాలసీని ఒక ఉదాహరణ ద్వారా అర్ధం చేసుకుందాం
ప్రీమియం వాపసు టర్మ్ పాలసీలను ఈ ఉదాహరణల ద్వారా పూర్తిగా అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
సందర్భం 1 –
రాము అనే 30 సంవత్సరాల యువకుడు ఒక బీమా సంస్థ నుండీ కోటి రూపాయలకు టర్మ్ ఇన్సూరెన్స్ రిటర్న్ అఫ్ ప్రీమియం పాలసీని సంవత్సరానికి 60 వేల ప్రీమియంతో తను 70 సంవత్సరాల వరకు లైఫ్ కవర్ తీసుకోవటం జరిగింది. దురదృష్టవశాత్తు తన 34 వ ఏట రాము రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది అప్పుడు బీమా సంస్థ రాము కుటుంబానికి కోటి రూపాయల బీమా చెల్లించడం జరిగింది దీంతో వారి కుటుంబానికి బీమా పాలసీ ఏంతో అండగా నిలిచింది.
సందర్భం 2 –
సందర్భం 1 లో వివరించినట్టు రాము తన టర్మ్ ఇన్సూరెన్స్ రిటర్న్ అఫ్ పాలసీ 1కోటి లైఫ్ కవర్ కోసం 30 ఏట నుండి తన 70 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 60 వేలు ప్రీమియంలు కడుతూ వచ్చాడు అదృష్టం కొద్ది రాము తన పాలసీ ఆసాంతం జీవించి ఉండటం జరిగింది.ఇప్పుడు పాలసీ ముగిసింది కావున తను గత 40 సంవత్సరాలుగా కడుతున్న ప్రీమియంలు అన్ని తిరిగి పొందడం జరిగింది.అంటే రాము తన ప్రీమియం కోసం కట్టిన 60వేల రూపాయలు గత 40 ఏండ్లుగా కడుతున్న ప్రీమియంలు అన్ని 70 వ సంవత్సరం లో GSTని మినహాయించి తిరిగి పొందడం జరిగింది అన్నమాట.
3 జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ :
మిగతా రెండు టర్మ్ ఇన్సూరెన్స్ లో ఉండే ప్రయోజనాలే జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ లో కూడా ఉంటాయి జీరో కాస్ట్ టర్మ్ పాలసీలో కూడా మరణ ప్రయోజనంతో పాటు రైడర్ ప్రయోజనాలను పొందవచ్చు , కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్,టర్మ్ రిటర్న్ పాలసీలకు కి దీనికి గల తేడా ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో పాలసీదారుడు మరణించని యెడల ప్రీమియం వెనక్కి రాదు , కానీ జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ లో ఒక నిర్దిష్ట సమయంలో పాలసీదారుడు పాలసీ నుండి నిష్క్రమిస్తే అనగా పాలసీ కాల పరిమితి పూర్తికాక ముందు పాలసీ నుండి ఎగ్జిట్ అయితే gst మినహాయింపుతో 100% ప్రీమియంలు తిరిగి పొందవచ్చు.టర్మ్ రిటర్న్ పాలసీలో కూడా కట్టిన ప్రీమియంలు తిరిగి చెల్లించబడుతుంది కదా అని అనుకుంటే టర్మ్ రిటర్న్ పాలసీలో ప్రీమియం చాలా అధికంగా ఉండటం చేత ,ఈ పాలసీ నుండి ఎప్పుడైనా నిష్క్రమించి ప్రీమియంలు తిరిగి పొందవచ్చు , కానీ జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎప్పుడు పడితే అప్పుడు ప్రీమియంలు తిరిగి చెల్లించబడవు,ఒక నిర్దిష్ట కాలంలో మాత్రమే నిష్క్రమించాల్సి వస్తుంది అప్పుడు మాత్రమే ప్రీమియంలు తిరిగి చెల్లించబడుతాయి. ఈ పాలసీలో కూడా ప్రీమియంలు టర్మ్ ఇన్సూరెన్స్ లోని ప్రీమియంలో వలే అత్యంత చవకగా ఉంటాయి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అద్భుతంగా ఉన్నప్పటికీ రిస్క్ జరగని యెడల కట్టిన ప్రీమియంలన్నీ వృధా అని భావించే వాళ్ళకి జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసి సరిగ్గా సరిపోతుంది.
జీరో కాస్ట్ టర్మ్ పాలసీని ఈ క్రింది ఉదాహరణల ద్వారా అర్ధం చేసుకుందాం.
సందర్భం 1 –
రాము అనే 30 సంవత్సరాల యువకుడు ఒక బీమా సంస్థ నుండీ కోటి రూపాయలకు జీరో కాస్ట్ టర్మ్ పాలసీని సంవత్సరానికి 30 వేల ప్రీమియంతో తను 70 సంవత్సరాల వరకు లైఫ్ కవర్ తీసుకోవటం జరిగింది. దురదృష్టవశాత్తు తన 32 వ ఏట రాము రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది అప్పుడు బీమా సంస్థ రాము కుటుంబానికి కోటి రూపాయల బీమా చెల్లించడం జరిగింది. దీంతో వారి కుటుంబానికి బీమా పాలసీ ఏంతో అండగా నిలిచింది.
సందర్భం 2 –
సందర్భం 1 లో వివరించినట్టు రాము తన జీరో కాస్ట్ టర్మ్ పాలసీ 1కోటి లైఫ్ కవర్ కోసం 30 ఏట నుండి తన 70 సంవత్సరాల వరకు ప్రతి సంవత్సరం 30 వేలు ప్రీమియంలు కడుతూ వచ్చాడు. రాము తన 65 వ సంవత్సరంలో విజయవంతముగా అడుగుపెట్టాడు. రాముకు కు తన పాలసీ ప్రకారం ఇంకా 5 సంవత్సరాల వరకు కవరేజ్ ఉన్నప్పటికీ, తన కుటుంభ బాధ్యతలు అన్ని నెరవేర్చిన కారణముగా ఇక నుండి తనకు టర్మ్ పాలసీ అవసరం లేదని తన టర్మ్ పాలసీ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకొని బీమా సంస్థకు తెలియజేశాడు. అప్పుడు బీమా సంస్థ రాము తన 30 వ ఏట నుండి 65 సంవత్సరాల వరకు కట్టిన ప్రీమియంలన్నింటిని GST ని మినహాయించుకుని తిరిగి రాముకు చెల్లించడం జరిగింది. ఈ విధముగా రాము జీరో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనలను మేరకు 5 సమ్వత్సరాల ముందే పాలసీని వదులుకొని 35 సంవత్సరాలుగా కట్టిన ప్రీమియం లన్నింటినీ GST ని మినహించుకొని 100% ప్రీమియంలు తిరిగి పొందడం జరిగింది.
ముగింపు :
టర్మ్ ఇన్సూరెన్స్ ఎంచుకొనే ముందు సరైన బీమా సంస్థను ఎన్నుకోవటమే కాకుండా సరైన కవరేజ్ ని ఎన్నుకోవాలి.తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఉండే పాలసీని ఎంచుకోవాలి.కేవలం మరణ ప్రయోజనంతో పాటు ఇతర రైడర్ లు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ యాక్సిడెంట్ డిసబులిటీ, టర్మినల్ ఇల్ నెస్ రైడర్ లాంటి ప్రయోజనాలను జీవించి ఉండగానే పొందవచ్చు.