పరిచయం :
రమేష్ – సురేష్ అనే ఇద్దరు మిత్రులు ఒక పిల్లల ఆసుపత్రి దగ్గర కలుసుకున్నారు.ఏంటి సురేష్ నువ్వు ఇక్కడ ఏంచేస్తున్నావ్ అని రమేష్ అడిగితే ఏముంది బయ్యా సీజన్ మారింది కదా నా కొడుకుకు జలుబు,ఉబ్బసం వారం రోజుల నుండి తగ్గకపోతే 2 రోజుల క్రితం హాస్పటల్ లో జాయిన్ చేశాను. ఇప్పటికే 20 వేలకు పైగా బిల్లు అయ్యింది ఇంకా 10 వేలు వరకు బిల్లు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెపుతున్నారు. మరి నువ్వు ఎం చేస్తున్నావ్ ఇక్కడ అని సురేష్ రమేష్ ని అడగ్గా… మా పాపకి కూడా అదే అనారోగ్య సమస్య 3 రోజుల ఉంచి ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాం అని చెప్పాడు.. అవునా మరి మీ పాపకు ఎంత బిల్ వేశారు అని అడగ్గా ? నేను బిల్లు కట్టాల్సిన అవసరం లేదు నాకు ఆరోగ్య బీమా ఉంది అందులో మా కుటుంభం మొత్తానికి కవర్ అయ్యే ఫ్యామిలీ ఫ్లోటర్ 10 లక్షల వరకు కవరేజ్ తీసుకున్నాం. 30 వేల వరకు బిల్లు అయ్యిందని చెప్పారు కానీ నేను ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ బిల్లులు అన్నింటిని ఆరోగ్య బీమా కంపినే చూసుకుంటుంది అని రమేష్ చెప్పాడు. అవును బయ్యా నేను తీసుకోవాలి అని అనుకున్న ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు ఇప్పడు వేలకు వేలు కట్టాల్సి వస్తుంది కానీ ఇప్పడు తప్పకుండా తీసుకుంటా అని ఇద్దరు మిత్రులు టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు.
పైన చెప్పిన రమేష్ – సురేష్ కథ ఆరోగ్య బీమా ప్రాధాన్యత ఏంటో అర్ధం చేసుకోవచ్చు
ఆరోగ్య బీమా అంటే ఏమిటి ?
HEALTH INSURANCE – ఆరోగ్య బీమా అనేది ఉహించని వైద్య అత్యవసర పరిస్థితిలో వైద్యానికి అయ్యే అన్ని ఖర్చులను భరిస్తానని పాలసీదారునికి- బీమా సంస్థ ఇచ్చే చట్టపరమైన హామీ లేదా ఒప్పందం. ఇందుకోసం పాలసీదారుడు బీమా సంస్థకు క్రమం తప్పకుండ ప్రీమియం చెల్లిస్తాడు అందుకు ప్రతిఫలంగా బీమా సంస్థ ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తుంది. మారుతున్న జీవనశైలి కొత్త కొత్తగా పుట్టుకస్థున్న రోగాలు కారణంగా ఆరోగ్య బీమా ప్రాధాన్యత పెరిగింది. ఒక కుటుంభ సంపూర్ణ ఆర్ధిక ప్రణాళికలో ఆరోగ్య బీమా తప్పనిసరి.ఆరోగ్య బీమా లేనట్లయితే ఊహించని అనారోగ్యం ఎదురైతే వైద్యానికి అప్పుతేవటమో ,ఆస్తులు అమ్మటమో లేదా సంపాదించిందంతా ఆసుపత్రులకు పెట్టడమో జరుగుతుంది కావున ఈ విధమైన ఆర్ధిక నష్టాల నుండి ఆరోగ్య బీమా కాపాడుతుంది.
ఆరోగ్య బీమా రకాలు ?
1) వ్యక్తిగత ఆరోగ్య బీమా: ఒక పాలసీ దారుడికి బీమా కంపెనీ హామీ ఇచ్చిన మొత్తం ఒక వ్యక్తికే కవర్ చేయబడుతుంది. కావున దీన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా అంటారు.
2) ఫ్యామిలీ ఫ్లోటర్ : అనగా కుటుంబంలోని వ్యక్తులందరికి కలిపి ఒకే పాలసీ ద్వారా బీమా సౌకర్యం కల్పించడం అన్నమాట.ఈ పాలసీలో కుటుంభాన్నంతా ఒకే గొడుగు క్రింద చేర్చి ఒకే ప్రీమియం చెల్లించవచ్చు.
3) సీనియర్ సిటిజన్ హెల్త్ ప్లాన్స్ : అనగా ఈ పాలసీలో 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారికి ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందించే పాలసీ.
4) క్రిటికల్ ఇల్నేస్ ఇన్సూరెన్స్ ప్లాన్స్: తీవ్రమైన వ్యాధులకు ఈ పాలసీ చక్కటి వరం.ఇందులో క్యాన్సర్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, పక్షవాతం, కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ, ఫస్ట్ హార్ట్ అటాక్, పల్మోనరి ఆర్టిరియల్ హైపర్ టెన్షన్, మల్టిపుల్ సిర్రోసిస్, ఓర్టా గ్రాఫ్ట్ సర్జరీ లాంటి వ్యాధులు ఈ పాలసీలో కవర్ చెయ్యబడతాయి
5) మెటర్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్: కొత్తగ పెళ్ళయిన జంటలు లేదా పిల్లల్ని కనాలనుకొనే దంపతులు ఈపాలసీని తీసుకున్నట్లయితే సాధారణ మరియు సీజేరియన్ రెండిటికీ ప్రసూతి ఖర్చులకు కవరెజీని అందిస్తాయి.అప్పుడే పుట్టిన నవజాత శిశువుకు Day-1 నుండి 90 రోజుల వరకు వచ్చే ఏటువంటి అనారోగ్య సమస్య అయిన మెటర్నిటీ పాలసీ కవర్ చేస్తుంది.
6) వ్యక్తిగత ప్రమాద బీమా: ఇది కూడా ఆరోగ్య బీమా పాలసీలో భాగం. ఏదేని అనుకొని ప్రమాదం కారణంగా మరణం లేదా అంగ వైకల్యం సంభవించినప్పుడు వైద్య ఖర్చులతో పాటు ఎంత మొత్తానికి పాలసీ చేయబడింది అంత మొత్తాన్ని వారికి నేరుగా డబ్బు రూపంలో చెల్లిస్తుంది.
7) గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ :ఈ పాలసీని సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు,వారి కుటుంబ సభ్యులకు కూడా అందిస్తాయి.పాలసీ కొనుగోలు పక్రియా అంత ఆ సంస్థ యజమాని భరిస్తాడు
ఆరోగ్య బీమా ప్రయోజనాలు :
1- నగదు రహిత చికిత్స ; ఆరోగ్య బీమా యొక్క ప్రాధమిక విధి నగదు రహిత చికిత్స అందించడం. పాలసీదారుడు తనకు ఎప్పుడు ఎటువంటి ఆపద వస్తుందో ఊహించలేదు ఆసమయంలో తన చేతిలో డబ్బులు లేకున్నా తను తీసుకున్న ఆరోగ్య బీమా ద్వారా నగదు రహిత చికిత్స పొందినట్లయితేనే తన ఆరోగ్య బీమా పాలసీకి అర్ధం ఉంటుంది. అందుచేత ప్రతి ఆరోగ్య బీమా సంస్థ నగరాలు , పట్టణాలలో ఉన్న ఆసుపత్రులతో అనుసంధానం చేసుకుంటాయి. వీటినే ‘నెట్వర్కింగ్ హాస్పటల్ లిస్ట్’ అంటారు. పాలసీ దారుడు తన చికిత్స నిమిత్తం తన పాలసీ నెంబర్ చెపితే చాలు ఉచితంగా చికిత్స అందిస్తారు. రూమ్ రెంట్ ,icu చార్జీలు , డాక్టర్ ఫీజులు, మెడిసిన్ ఖర్చుతో పాటు ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన అన్ని ఖర్చులను ఆరోగ్య బీమ సంస్థ చెల్లిస్తుంది.
నోట్ : ఇటీవల నెట్వర్కింగ్ ఆసుపత్రులతో సంభంధం లేకుండా నగదు రహిత చికిత్స అందించాలని IRDAI అన్ని బీమా సంస్థలను ఆదేశించింది.
2- ప్రీ మరియు పోస్ట్ హాస్పిటల్ ఖర్చులు ; ఆరోగ్య బీమా ద్వారా ఆసుపత్రిలో చేసే ముందు మరియు చేరిన తర్వాత అయ్యే వైద్య ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. ఆసుపత్రి వెళ్లడానికి ముందు అయ్యే ఖర్చులను ప్రీ హాస్పిటల్ ఖర్చులని మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తరువాత అయ్యే ఖర్చులను పోస్ట్ హాస్పిటల్ ఖర్చులు అంటారు. ఇవి సాధారణముగా ప్రీ హాస్పిటల్ ఖర్చులను 60 నుండి పోస్ట్ హాస్పిటల్ ఖర్చులను 180 వరకు కవర్ చేస్తారు.
3- అంబులెన్స్ సౌకర్యం ; ఇంటి నుండి ఆసుపత్రికి ఆసుపత్రి నుండి ఇంటికి అయ్యే దారి ఖర్చులను కూడా ఆరోగ్య బీమా సంస్థే భరిస్తుంది. ఏది ప్రతి పాలసీలో ఉండే కనీస సదుపాయాంగా చెప్పవచ్చు
4- డే కేర్ చికిస్థలు ; ఇప్పుడు అన్ని ఆరోగ్య బీమా సంస్థలు డేకేర్ చికిత్సలను బీమా పాలసీ పరిధిలోకి తీసుకరావటం జరిగింది. ఆరోగ్య బీమాలో డే కేర్ చికిత్సలు అనగా ఉదయం ఆసుపత్రిలో చేరి సాయంత్రం లోపు వైద్యం పూర్తయి డిశ్చార్జ్ అయ్యే వైద్య చికిస్థలనే డే కేర్ చికిత్సలు అంటారు.అనగా ఉదయం అల్పాహారం చేసి సాయంత్రం డిన్నర్ సమయానికి ఇంటికి చేరే విధానంగా తీసుకునే చికిత్సలను డే కేర్ చికిస్థలుగా చెప్పవచ్చు. ఆరోగ్య బీమాలో క్లెయిమ్స్ రావాలంటే ఒకప్పుడు 24 గంటలు తప్పనిసరి ఆసుపత్రిలో ఉండాలనే నిబంధన ఉండేది కానీ ఈ డే కేర్ ట్రెయిట్మెంట్స్ లో భాగంగా అన్ని భీమా సంస్థలు ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకరావటం జరిగింది.
5- ఇంటివద్ద తీసుకొనే చికిత్సలు ; దీన్నే డొమిసిలరి ట్రీట్ మెంట్ అని కూడా అంటారు . కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఇంటి వద్దే చికిత్స తీసుకున్న దానికి అయ్యే ఖర్చులన్నింటిని ఆరోగ్య బీమా సంస్థ చెల్లిస్తుంది.ఆరోగ్య బీమాలో డొమిసిలరీ వైద్యం అంటే ఇంటి వద్దే చికిత్స పొందే సదుపాయాన్ని కల్పించడం అన్న మాట.దీన్నే హోమ్ ట్రీట్ మెంట్ లేదా రెసిడెన్షియల్ కేర్ అనికూడా అంటారు. ఆసుపత్రిలో తీసుకోవాల్సిన చికిత్సలను ఇంట్లో ఉండే పొందే సౌకర్యాన్ని డొమిసిలరీ చికిత్సలు అంటారు.
6- ఆయుష్ కవర్ ; ఆయుష్ చికిత్సలు లేదా ప్రత్యాన్మాయ వైద్య చికిత్సలను సంప్రదాయ వైద్య పద్ధతులుగా చెప్పవచ్చు.ఆయుష్ వైద్య విధానంలో భాగంగా ఆయుర్వేదం,హోమియోపతి ,యునాని,సిద్ధ ,యోగ వంటి వైద్య పద్ధతులు ఆయుష్ చికిత్సలో భాగంగా కవర్ చెయ్యబడ్డాయి. 2013 లో భరత బీమా ప్రాధికార సంస్థ (IRDAI) అన్ని ఆరోగ్య బీమా సంస్థలను ఆయుష్ చికిత్సలు అందించాలని ఆదేశాలివ్వటం జరిగింది.. గతంలో అల్లోపతి చికిత్స విధానాలకు మాత్రమే బీమా చెల్లించేది, కాని ఇప్పుడు అన్ని ఆరోగ్య బీమ సంస్థలు ఆయుర్వేద ,యోగ,యునాని సిద్ధ, హోమియోపతి లాంటి చికిస్థలను కూడా బీమా సంస్థ కవర్ చేస్తుంది .
7- మెడికల్ చెక్ అప్ ; బీమా సంస్థ పాలసీ ధారుణి ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ద వహిస్తుంది అందుకు ప్రతి సంవత్సరం బీమా ధారుణి ఆరోగ్య స్థితిని తెలుసుకోవటం కోసం ప్రతి సంవత్సరం ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తుంది.
8- రోబోటిక్ సర్జరీ: హెల్త్ పాలసీలో అత్యాధునిక పరికరాలతో చేసే రోబోటిక్ సర్జరీలు కూడా ఆరోగ్య పాలసీలో కూడా కవర్ చేయబడుతాయి
9- ఆర్గాన్ డోనర్: మీకు అవయవం అవసరం వచ్చినా మీరు వేరే ఎవరికైనా అవయవ దానం చేయాలకున్న అందుకు అయ్యే వైద్య ఖర్చులకు ఆరోగ్య బీమానే కవర్ చేస్తుంది
ఆరోగ్య బీమా ఏ విధంగా పనిచేస్తుంది ?
ఆరోగ్య బీమా తీసుకున్న వెంటనే అన్ని రకాల వ్యాధులు ఒకేసారి కవర్ చెయ్యబడుతాయి అనే అపోహ చాలా మందిలో ఉంది అయితే ఆరోగ్య బీమాను వైద్య ఖర్చుల నుండి తప్పించుకోవటం కోసం తీసుకున్నప్పటికీ అన్ని వ్యాధులను ఆరోగ్య బీమా సంస్థలు ఏక కాలంలో కవర్ చెయ్యవు. ప్రతి ఆరోగ్య బీమా సంస్థ ఈ క్రింది పరిమితులకు అనుగుణంగా పనిచేస్తుంది.
గమనిక : వీటిని కేవలం సులభంగా అర్ధం చేసుకోవటం కోసం మాత్రమే A,B,C,D లుగా విభజించడం జరిగింది అవి…
A –ప్రమాదవశాత్తు జరిగితే :రోడ్డు,రైలు,పడవ,విమాన ,ప్రమాదాలు కరెంట్ షాక్… అగ్ని ప్రమాదాలు అనుకోకుండా కాలు జారి పడిపోవటం లాంటి ప్రమాదాలు DAY -1 నుండే కవర్ చేయబడతాయి
B –ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ : డెంగ్యూ,మలేరియా,చికెన్ గున్యా ,టైఫాయిడ్,వైరల్ ఫీవర్ ,లాంటి వ్యాధులు 30 రోజుల తర్వాత కవర్ చెయ్యబడతాయి
C –కొన్ని ప్రత్యేక వ్యాధులకు బీమా కవర్ ; కంటి శుక్లాలు,కిడ్నీ స్టోన్స్ ఫైల్స్,గాలి బ్లాడర్, నీ రీప్లేస్మెంట్,మరియు చెవి ముక్కు గొంతు లాంటి సర్జరీలు, 2-సంవత్సరాల తర్వాత కవర్ చెయ్యబడతాయి
D –ప్రీ – ఎక్సిస్టింగ్ డీసీసెస్ : బి.ప్ ,షుగర్ ఆస్తమా,కొలెస్ట్రాల్ వంటి వ్యాధులకు 2-నుండి 4 సంవత్సరాల తర్వాత కవర్ చెయ్యబడతాయి .
గమనిక : కొన్ని రైడర్స్ ని ఆప్ట్ చేసుకుంటే కాల పరిమితి తగ్గుతుంది
ఆరోగ్య బీమాలో కవర్ చెయ్యని వ్యాధులు లేదా మినహాయింపు సందర్భాలు :
కొన్ని రకాల వ్యాధులు లేదా కొన్ని సందర్భాలలో ప్రత్యేకించి కవర్ చెయ్యబడవు ఇవి ఒక్కో బీమా సంస్థకు ఒక్కో విధంగా ఉండవచ్చు. అయితే కొన్ని సాధారణ మినహాయింపులు తెలుసుకుందాం.
1) సుఖరోగాలు HIV ,AIDS ,STDs లాంటి వ్యాధులను కవర్ చెయ్యదు
2) ఆత్మహత్య లేదా స్వయంగా తనకు తానే చేసుకొనే గాయాలకు కవర్ చేయబడదు
3) పుట్టుకతో వచ్చిన వ్యాధులు
4) యుద్ధం,ఉగ్రవాదం , సైనిక,అణు కార్యక్రమాల వాళ్ళ కలిగే గాయాలు
5) బిలాజికల్ ,కెమికల్,రేడియాక్టివ్ కార్యక్రంలో సంభవించే వ్యాధులకు అయ్యే వైద్య ఖర్చులను కవర్ చెయ్యదు
6) కాస్మొటిక్ సర్జరి , ప్లాస్టిక్ సర్జరీ హార్మోన్ సర్జరీ లాంటివి లేదా, అందం కోసం లేదా రూపం మార్చుకోవటం కోసం చేసే ఏ చికిత్సలు కూడా కవర్ చెయ్యబడవు
7) అబార్షన్ ,వ్యంధత్వం లాంటి అనారొగ్య పరిస్థితులు కవర్ చెయ్యబడవు
8) ప్రమాదకర లేదా సహస క్రీడలలో ఐన గాయాలకు సంబంధించిన పారా జుంపింగ్ ,రాక్ క్లిమ్బింగ్ ,పర్వతారోహణ ,రాప్టింగ్ మోటార్ రేసింగ్ ,గుర్రపు పందెం, స్కూబా డైవింగ్, హ్యాండ్ గ్లిడింగ్, స్కై డైవింగ్ ,డీప్ సి డైవింగ్ లాంటివి వృత్తిపరంగా చేస్తే కవర్ చెయ్యబడవు. కానీ వీటినే వృత్తి పరంగా కాకుండా వినోదం కోసం శిక్షణ పొందిన ప్రొఫషనల్ పర్యవేక్షణలో చేసినపుడు అయినటువంటి గాయాలను కవర్ చేయబడతాయి
9) పాలసీదారుడు ఆల్కహాల్ ,డ్రగ్స్, మాదక ద్రవ్యాలు ,నికోటిన్ ,ఒపీయయీడ్స్ తీసుకొన్న మత్తులో ఏదేనా గాయాలుఅయినచో కవర్ చెయ్యబడవు
10) పాలసీదారుడు మద్యం మానెయ్యడంలో వచ్చిన with drawal మరియు, డీ – అడిక్షన్ ట్రీట్మెంట్ కు కవర్ చేయబడదు
11) పొగాకు వినియోగిస్తూ ఓరల్,ఒరొ ఫారింక్స్ మరియు శ్వాస కోశ వ్యవస్త కాన్సర్ కు సంబంధించిన వ్యాధులను కవర్ చేయబడదు
గమనిక : పైన చెప్పిన మినహాయింపులు పాలసీ పాలసీకి మారుతుంటుంది. కావున కచ్చితమైన సమాచారం కోసం మీరు ఎంచుకున్న పాలసీ డాక్యుమెంట్ ను తప్పక చుడండి.
ఆరోగ్య బీమా ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు :
1) వయస్సు: సాధారణంగా వయస్సు పెరుగుతున్న కొద్ది ఆరోగ్యబీమా ప్రీమియం పెరుగుతుంది.అందుకే ఆరోగ్య బీమాను చిన్న వయసులోనే తీసుకోవాలని చెపుతుంటాము యవ్వనంలో రోగ నిరోధకశక్తి ఎక్కువగాను వృధ్యాప్యంలో తక్కువ గాను ఉంటుంది అందుకే వృద్ధులు తరచు జబ్బు పడుతూ వుంటారు కావున సీనియర్ సిటిజన్స్ కి ప్రీమియం ఎక్కువ గాను ఉంటుంది
2) జెండర్ : పురుషులకన్నా స్త్రీలలో ఆరోగ్య బీమా తక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరిలో గుండెపోటు , ఆక్సిడెంటల్ ప్రమాదాలు తక్కువ కావున
3) జీవనశైలి : ధూమపానం,మద్యపానం లాంటివి వ్యక్తి జీవనవిధానంఫై ఎక్కువ ప్రభావాన్ని చుపిస్తాయి మం దేశంలో నూటికి 60శాతం మరణాలు జీవన శైలి విధానం వళ్ళ సంభవిస్తున్నాయి కావున వీరి విషయంలో బీమా సంస్థలు రిస్క్ అధికంగా ఉండటం చేత ప్రీమియంని అధికంగా వసూలు చేస్తాయి
4) వైద్య చరిత్ర: ఇప్పటికే ఏదయినా ఏదైనా వ్యాధులు లేదా వంశ పారంపర్యంగా సంక్రమించే వ్యాధులు ఉన్నట్లయితే ప్రీమియం పెరిగే అవకాశం ఉంది
5) ప్రాంతం : మనం నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది ఆ ప్రాంతంలో వైద్య ఖర్చులు ప్రీమియంని ప్రభావితం చేస్తాయి మన దేశములోని వివిధ ప్రాంతాలను A,B,C జోన్లుగా విభజించడం జరిగిందిం .ఇందులో A జోన్ ప్రీమియం అధికంగాను B జోన్ కొంచం తక్కువగాను C జోన్ A,B జోన్ల కన్నతక్కువ గాను ఉంటుంది .మన రెండు తెలుగు రాష్టాల్లో హైదరాబాద్,సికింద్రాబాద్ జోన్ B పరిధిలోకి మిగత ప్రాంతాలు జోన్ C పరిధిలోకి వస్తాయి
6) ప్లాన్ రకం : మనం ఎంచుకొనే ఆరోగ్య బీమా పాలసీ రకాన్ని బట్టీ ప్రీమియం ప్రభావితం అవుతుంది సాధారణ ఆరోగ్య పాలసీ కన్నా సీనియర్ సిటిజన్ ,మెటర్నిటీ పాలసిలా ప్రీమియం అధికంగా ఉంటుంది
7)అదనపు రైడర్స్ ; ఆరోగ్యబీమా పాలసీలో వివిధ రైడర్స్ ఉన్నాయి వాటిని ఆప్ట్ చేసుకున్నట్లయితే ప్రీమియం పెరిగే అవకాశం ఉంది
ఆరోగ్య బీమా కొనుగోలు అర్హతలు
* పాలసీ కొనుగోలుకు కనీస వయస్సు 18 నుండి 65 సంవత్సరాలు
* అయితే చిన్న పిల్లలకు ,డిపెండెన్స్ కు పుట్టిన 90 రోజుల నుండి 25 సంవత్సరాల వరకు వారి తల్లిదరులతో కలిపి తీసుకోవచ్చు
* 45 నుండి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న పాలసీదారులను బీమా సంస్థలు ఫ్రీ మెడికల్ స్కీనింగ్ నిర్వహించవచ్చు
* 60 సంవత్సరాల ఫై బడిన వారికి సీనియర్ సిటిజెన్ హెల్త్ పాలసీని అందజేస్తాయి.ఈ బీమా కోసం వైద్య పరీక్షలు తప్పనిసరి.
ఆరోగ్యబీమా క్లెయిమ్స్ ఏ విధంగా చెయ్యాలి :
ఆరోగ్య బీమాలో రెండు రకాల క్లెయిమ్ పద్ధతులు ఉన్నాయి, అవి ఒకటి క్యాష్ లెస్ క్లయిమ్స్ , రెండు రీయింబర్సుమెంట్.వీటిని వివరంగబతెల్సుకుందాం
కాష్ లెస్ క్లెయిమ్ : అనగా మీకు ఆరోగ్య బీమా అవసరం పడి ఆసుపత్రిలో చేరితే అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని బీమా సంస్థనే చెల్లిస్తుంది.ఇందుకు మన జేబు నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.దీన్నే క్యాష్ లెస్ క్లెయిమ్ అంటారు.
రీయింబర్సుమెంట్ క్లెయిమ్ : ఇందులో ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటున్నపుడు అయిన ఖర్చులను మీరె స్వయంగా మీ జేబు నుండి ఖర్చుపెట్టినప్పటికీ మీకు ఆరోగ్య బీమా ఉన్నట్లయితె ఆ ఖర్చులన్నింటిని ఆరోగ్య బీమా సంస్థ తిరిగి మీకు చెల్లిస్తుంది.దీన్నే రీయింబర్సుమెంట్ క్లెయిమ్ అంటారు. ఇది కొంత కాలయాపన మాత్రమే కాకుండా కొంత రిస్క్ తో కూడుకున్నది.
ముగింపు :
బీమా (ఇన్సూరెన్స్ ) సంబంధించిన సమాచారం అంత సులువుగా అర్ధం కానీ పదజాలంతో కూడుకొని ఉంటుంది.అందుచేత ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించిన కొనుగోలులో అనుభవం ఉన్న సలహాదారుడు లేదా IRDAI ధ్రువీకరించిన సలహా దారుల సూచనల మేరకు పాలసీ కొనుగోలు చెయ్యడం మంచిది.