ప్రమాద బీమా అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు వివరించండి? -

ప్రమాద బీమా అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు వివరించండి?

share

పరిచయం :

రాము -మహేష్  అనే ఇద్దరు మిత్రులు తమ స్వగ్రామం నుండి బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి డ్రైవింగ్ వృత్తిలో స్థిరపడి పోయారు. రాము సొంత కారు  ఉండటం చేత తానే ప్రైవేట్ గా కిరాయిలు నడుపుతుండగా మహేష్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర డ్రైవర్ గా  చేరి వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.  తాను నిత్యం  తన వాహనంతో రోడ్డుమీద ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది కావున ఎప్పుడు ఎటువంటి ప్రమాదం వచ్చునోనని రాము ప్రమాద బిమా తీసుకున్నాడు.ఇదే విషయాన్నీ మహేష్ కు  కూడా చెప్పి తీసుకొమ్మని చెపితే ఎప్పుడు శ్రద్ధగా వినింది లేదు. ఆ తరవాత ఒక ఉదయమే రాముకు ఫోన్ కాల్ ద్వారా మహేష్ నడిపే కారు ప్రమాదానికి గురైందని మహేష్ రెండు కాళ్ళు కోల్పోయాడని సమాచారం తెలుసుకున్నాడు. తన మిత్రుడి కుటుంభం ఇకనుండి ఏవిధముగా బ్రతుకీడుస్తుందో తలుచుకొని బాదపడ్డాడు.మహేష్ తన లాగే ప్రమాద బీమా తీసికున్నట్లయితే నేడు వారి కుటుంబానికి కొంత భరోసా ఉండేదని తనకు తానే బాధపడ్డాడు.

పైన వివరించిన రాము – మహేష్ కథ ప్రమాద బీమా అవసరాన్ని తెలియజెస్తుంది.

మనం జీవన మనుగడ కోసం ప్రతిరోజు ఏదో ఒక ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఏ ఆపద ఎప్పుడు,ఎటువైపు నుండి వస్తుందో ఊహించలేం. అంతెందుకు ఎటువంటి ప్రయాణం చేయకున్నా AC గదులలో కూర్చొని  వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న కూడా అగ్ని ప్రమాదం లాంటి సంఘటనలలో ప్రాణాలు కోల్పోవటం లేదా అటువంటి ప్రమాదాలలో శరీర భాగాలు కోల్పోయి అవిటి వాళ్ళు అవటం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల నుండి పాలసీదారునికి  వారి కుటుంబానికి భద్రత కోసం ఈ ప్రమాద బీమా ఈ పాలసీ ఎంతో తోడ్పడుతుంది. ప్రమాద బీమా పాలసీ తీసుకున్న వ్యక్తి తీవ్ర గాయాలైన,అంగవైకల్యం చెందిన, శరీరంలోని ఏదైనా అవయవం కోల్పోయిన పాలసీదారునికి జరిగిన నష్టాన్ని ఈ పాలసీ ద్వారా ఆర్థిక  భరోసాను పొందవచ్చు.

ప్రమాద బీమాను రెండు రకాలుగా విభజించవచ్చు..

1)వ్యక్తిగత ప్రమాద బీమా- అనగా ఒకే వ్యక్తి తన కోసం వ్యక్తిగతంగా తీసుకొనే పాలసీనే వ్యక్తిగత ప్రమాద బీమా అంటారు. ఈ వ్యక్తిగత ప్రమాద బీమాలో పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణం సంభవించిన,ఇదే ప్రమాదంలో శరీర భాగాలూ కోల్పోయిన బీమా సంస్థ ఆ పాలసీదారునికి నేరుగా పాలసీ హామీ మేరకు ఆర్ధిక చెల్లింపులు చేస్తుంది.
2) వ్యక్తిగత గ్రూప్ ప్రమాద బీమా- కొందరు వ్యక్తుల సమూహ ప్రయోజనం కోసం తీసుకొనే పాలసీనే “గ్రూప్ పర్సనల్ ఆక్సిడెంట్ పాలసీ” అంటారు. ఇది వివిధ వ్యాపార సంస్థలు,ఉద్యోగస్తులు,కార్మికులు, కర్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల ఆర్థిక భద్రత కోసం పాలసీని తీసుకుంటాయి. ఒక కంపెనీ తమ ఉద్యోగుల కోసం గ్రూప్ ప్రమాద బీమా తీసుకుంటే, ఆ ఉద్యోగులలో ఎవరికైనా ప్రమాదం జరిగితే, వారికీ లేదా వారి కుటుంబ సభ్యులకు బీమా కంపెనీ నుండీ ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది తక్కువ ప్రీమియంతో లభిస్తుంది.

ఈ ప్రమాద బీమా 4 రకాల ప్రమాదాలను కవర్ చేస్తుంది

1- మరణ ప్రయోజనం :

బీమా చేయబడిన వ్యక్తి ప్రమాద కారణంగా మరణించినట్లయితే వారిపై ఆధారపడిన వారి కుటుంబానికి లేదా నామినికి మరణ ప్రయోజనం చెల్లించబడుతుంది.కాకపోతే మరణం ఏదేని ప్రమాదకరణంగా మాత్రమే సంభవించాలి.

ఊదా:- పాలసీదారుడు  రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకుని  ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబానికి లేదా నామినీకి రూ.10 లక్షల రూపాయలు చెల్లించబడుతాయి.

2 : శాశ్వత అంగవైకల్యం :

ఏదేని ప్రమాద కారణంగా పాలసి దారుడు శరీర అవయవాలు పనిచేయకుండా పొయ్యి శాశ్వత అంగ వైకల్యం ఏర్పడితే బీమా మొత్తం అతనికి అందిస్తుంది.ఉదాహరణకి…కంటిచూపు,వినికిడి,మాటలు,శరీర అవయవాలు మొదలైనవి కోల్పోవటం.

ఉదా :- ఒక వ్యక్తి రూ.10 లక్షల ప్రమాద బీమా పాలసీ కలిగి ఉన్నారు. అనుకోని ప్రమాదంలో తను రెండు కాళ్లను కోల్పోవటం జరిగింది. అందుకు బీమా సంస్థ శాశ్వత అంగవైకల్యంగా అయినందున అతనికి ₹10 లక్షల ప్రమాద  బీమా మొత్తం చెల్లించబడుతుంది.

3) శాశ్వత పాక్షిక వైకల్యం :

ఏదేని ప్రమాద కారణంగా పాలసీ దారుడి శరీర అవయవాలు కొంత మేరకు మాత్రమే నష్టపోయిన కూడా బీమా చేయబడిన వ్యక్తికి బీమా పాలసీలో పేర్కొన్న విధముగా ఏ అవయవం కోసం ఎంత చెల్లించబడుతుందో బీమా సంస్థ పాలసీ డాక్యుమెంట్లో పేర్కొన్న విధముగా డబ్బు చెల్లించబడుతుంది.

4)తాత్కాలిక మొత్తం వైకల్యం :

ఏదేని ప్రమాద కారణంగా పాలసి ధారుడికి తాత్కాలికంగా అనగా ప్రాణ నష్టంగాని, శాశ్వత శారీరక అంగ వైకల్యం గాని కలుగక పోయిన కొద్ది రోజులు పూర్తిగా పనిచేయకుండా ఉండే పరిస్థితిని తాత్కాలిక మొత్తం వైకల్యం అంటాం. అది తన రోజువారీ ఆదాయ నష్టానికి గురి చేస్తుంది. కావున పాలసీ నిబంధనల మేరకు బీమా ఎంత చెల్లించాలో ఎంతమేరకు ప్రమాద బీమా చెల్లించ బడుతుంది.

దీంతో పాటు వ్యక్తిగత ప్రమాద బీమా యొక్క అదనపు ప్రయోజనాలు :

ఆసుపత్రి రోజువారీ నగదు: ఏదేని ప్రమాద కారణంగా ఆసుపత్రిలో చేరిన సందర్భంలో పాలసీ ధారుడికీ ఆసుపత్రిలో ఉన్నన్నిరోజులు నేరుగా నగదు చెల్లించ బడుతుంది. ఇది పాలసీ డాక్యుమెంట్ లో పేర్కొన్న విధంగా చెల్లించబడుతుంది.

అంబులెన్సు ఖర్చులు : ఏదేని ప్రమాదం కారణంగా పాలసీదారుడు ప్రయాణించే అంబులెన్సు చార్జీలను అందిస్తుంది.అది ప్రమాద స్థలం నుండి ఆసుపత్రికి లేదా ఆసుపత్రి నుండి ఇంటికి అయ్యే అంబులెన్సు ఖర్చులను ప్రమాద బీమా చెల్లిస్తుంది.

విరిగిన ఎముకలకు ఆర్థిక పరిహారం: ఏదేని ప్రమాదంలో ఎముకలు విరిగిన లేదా దెబ్బతిన్నట్లయితే ప్రమాద బీమా  క్రింద ఆర్ధిక  ప్రయోజనం అందించబడుతుంది.అది పాలసీలో పేర్కొన్న విధముగా నేరుగా పాలసీదారునికి చెల్లింపబడుతుంది.

కాలిన గాయాలకు ఆర్థిక పరిహారం : ప్రమాదవశాత్తూ కాలిన గాయాలకు కూడా పాలసీ ద్వారా ప్రయోజనం అందించబడుతుంది. ప్రమాద కారణముగా పాలసీదారుడు ఏదేని అగ్ని ప్రమాదంలో శరీర భాగాలూ కాలిపోతే అందుకు కూడా ప్రమాద బీమా ద్వారా ఆర్ధిక ప్రయోజనం చెల్లించబడుతుంది.

విద్యా ప్రయోజనం : పాలసీ దారుడి అకాల మరణంతో అతనిపై ఆధారపడిన పిల్లల చదువులకు ఏటువంటి ఆకంటం రాకుండా పాలసీ కవర్ చెయ్యబడుతుంది. ఎంతమేరకు ఆర్ధిక చెల్లింపులు చెల్లించాలో పాలసీ డాక్యుమెంట్ లో పేర్కొనబడుతుంది.

అడాప్టేషన్ అలవెన్స్: అనగా ఇంటి మార్పు లేదా వాహన సవరణకు నిచ్చే  ఆర్ధికప్రయోజనంగా చెప్పవచ్చు.ప్రమాదం కారణంగా అంగవైకల్యం ఏర్పడితే ఇల్లు లేదా వాహనాన్ని సవరించడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉండవచ్చు. అందుకోసం ఈ పాలసీ ప్రయోజనం అందిస్తుంది.

మృతదేహాల రవాణా ఖర్చులను కవర్ చేస్తుంది : పాలసీ దారుడు ప్రమాదవశాత్తూ విదేశాల్లో మరణించినట్లయితే మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావటానికి అయ్యె ఖర్చును భరిస్తుంది.అలాగే స్వదేశంలోనే  ఏదేని  ఆసుపత్రిలో మరణించినట్లయితే ఇంటికి అక్కడనుండి  స్వశాన వాటికకు తరలించే ఖర్చులను కవర్ చేస్తుంది. అంతే కాకుండ కొన్ని ప్రమాద బీమా పాలసీలు దహన సంస్కారాలకు సంభందించిన ఖర్చులను కూడా పాలసీ కవర్ చేస్తుంది.

వ్యక్తిగత ప్రమాద బీమా ఫీచర్లు :

విస్తృత కవరేజ్-  ఇతర రకాల పాలసీలతో పోల్చుకుంటే వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలో బహుళ ప్రయోజనాలతొ పాటు అతి తక్కువ ప్రీమియం చెల్లించ బడుతుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ అందిచే పాలసీలో ప్రమాద బీమా ఒక్కటి.

ప్రపంచవ్యాప్త కవరేజ్- చాలా రకాల బీమా పాలసీలు భౌగోళిక పరిధిని కలిగి ఉంటాయి. అంటే అవి భారతదేశం వెలుపల సంభవించే ఏదేని ప్రమాదానికి పరిహారం చెల్లించదు. కానీ వ్యక్తిగత ప్రమాద బిమాలో అలాంటి పరిమితి లేదు, ప్రమాదం జరిగిన ప్రదేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్త కవరేజ్ అందిస్తుంది.

వైద్య పరీక్షలు అవసరంలేదు – లైఫ్ ఇన్సూరెన్స్ ,టర్మ్ ఇన్సూరెన్స్ ,హెల్త్ ఇన్సూరెన్స్ వలె ప్రమాద బీమా కోసం  ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండానే ప్రమాద బీమా జారీ చెయ్యటం జరుగుతుంది.

జీవితకాలపు పునరుద్ధరణ – ప్రతి సంవత్సరం పాలసీని సకాలంలో పునరుద్ధరించినట్లయితే జీవితాంతం ఈ పాలసీని కొనసాగించవచ్చు. ఇందుకోసం ఎటువంటి వైద్య పరీక్షలు అవసరం లెవ్వు.

వెయిటింగ్ పిరియడ్ లేదు – ఈ పాలసీలో ఏటువంటి నిర్ణీత కాల నిబంధనలు కానీ వెయిటింగ్ పీరియడ్ కానీ లెవ్వు . పాలసీ తీసుకున్న రోజు నుండే పాలసీదారునికి ఏదేని ప్రమాదం సంభవిస్తే పాలసీ  ప్రయోజనాలు చెల్లించబడుతాయి.

ప్రజా రవాణాలో ప్రయాణిస్తే రెట్టింపు ప్రయోజనం – ఈ పోలీసిలో ఉన్న అద్భుత ప్రయోజనం ఇది.ప్రభుత్వ అధీనంలో ఉన్న ఏ ప్రయాణ సాధనంలో నైనా ప్రమాదం సంభవిస్తే రెట్టింపు ప్రయోజనం అందిస్తాయి. ప్రభుత్వ అధీనంలో నడిచే బస్సులు,రైళ్లు వంటి ప్రయాణ సాధనాల్లో మరణిస్తే రెట్టింపు మరణ ప్రయోజనం పొందవచ్చు.

పన్ను ప్రయోజనాలు – ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం ఎలాంటి బీమా ప్రీమియం కోసం చెల్లింపులకు గాను పన్ను ప్రయోజనాలు, బీమా పరిహారానికి గాని ఎటువంటి పన్నులు విధించరు.

గమనిక : వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ క్రింద కవర్ చేయని విధానాలు :                                                                                                                                
1- ఆత్మహత్య కారణంగా పాలసీ పొందిన వ్యక్తి ఏటువంటి బీమా ప్రయోజనాన్ని పొందలేడు
2- పాలసీ దారుడు ఉద్దేశ పూర్వకంగా స్వయంగా గాయాలు చేసుకున్నట్లయితే లేదా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో ప్రమాదం సంభవించినట్లయితే పాలసీ కవర్ చెయ్యదు
3- సాహస క్రీడల వల్ల తలెత్తే గాయాలు కూడా పాలసీ కవర్ చెయ్యబడదు
4- పౌర యుద్ధం లేదా విదేశీ యుద్ధంలో పాల్గొనటం వల్ల అయిన నష్టాలను పాలసీ కవర్ చెయ్యదు
5- మద్యం మత్తులో అనగా మత్తు పదార్థాలు, ఆల్కహాల్ ,డ్రగ్స్ వంటి వాటినీ తీసుకొని ప్రమాదానికి గురైతే పాలసీ వర్తించదు
6- చట్ట వ్యతిరేక దేశ ద్రోహ కార్యక్రమాలు సమ్మెలు,నిరసనలు,అల్లర్లలో పాల్గొని ఏదేని ప్రమాదం సంభవించినట్లయితే ప్రయోజనం ఉండదు.
7- సాయుధ దళాల్లో పనిచేస్తున్న వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా ఏదేని ప్రమాదం సంభవించిన  కవర్ చేయబడదు.
8- HIV, ఏయిడ్స్,STD వంటి వ్యాధుల కారణంగా ఏదేని ప్రమాదం సంభవిస్తే బీమా చెల్లింపబడవు
9- గత అనారోగ్యాల కారణంగా ఏదేని తీవ్రమైన అనారోగ్యం ఏర్పడితే ఈ పాలసీ క్రింద కవర్ చెయ్యబడదు.
10- గర్భం లేదా ప్రసవ సంభందిత సమస్యల వల్ల ఉత్పన్నం అయ్యె ఏటువంటి క్లయిమ్స్ కు   బీమా చెల్లిపబడదు

పాలసీ చేయడానికి ఎవరు అర్హులు…?

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ కోసం ఎవరైనా దరఖాస్తు చెయ్యవచ్చు,కానీ ఈ క్రింద పేర్కొన్న వారు తప్పా?
1)వైమానిక దళ సభ్యులు
2)సాయుధ దళాల సభ్యులు
3)నిర్ధేశిత వయస్సు లేనివారు అనగా 5సంవత్సరాల నిండనివారు మరియు 70 సంవత్సరాలు నిండినవారు

వ్యక్తిగత ప్రమాద బీమా ఎంత తీసుకోవాలి..?
ఇది పాలసీదారుడీ సంపాదన మీద ఆధారపడి ఉంటుంది. పాలసీదారుడి నెల సంపాదనకి 100 రెట్లు పాలసీ తీసుకోవచ్చు ఉదా…
మీ ప్రస్తుత సంపాదన నెలకు 10000 (పది వేలు) అయితే మీరు1000000(పది లక్షలు) వరకు ప్రమాద బీమా చెయ్యవచ్చు.

పాలసీ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు :

సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీలు వయస్సును బట్టి ప్రీమియం నిర్ణయించబడతాయి. వ్యక్తిగత ప్రమాద బీమా వయసుతో పాటు వృత్తులను బట్టి 3 వర్గాలుగా విభజించడం జరిగింది
CLASS- 1- ఇందులో ప్రమాద రిస్క్ తక్కువగా ఉంటుంది కావున ఈ కేటగిరి వాళ్లకు తక్కువ ప్రీమియం ఉంటుంది
ఉదా…అకౌంటెంట్స్,బాంకు ఉద్యోగులు, లాయర్స్ మొదలగువారు
CLASS- 2 ఇందులో ప్రమాద రిస్క్క్లాస్ 1 కేటగిరితో పోల్చితే ఎక్కువగా ఉంటుంది కావున ప్రీమియం కూడా పెరుగుతుంది
ఉదా… బిల్డర్స్, కాంట్రాక్టర్స్ మెదలైన వారు
Calss-3 ఇందులో ప్రమాద రిస్క్ అతి ఎక్కువగా ఉంటుంది కావున ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది.
ఉదా.. జర్నలిస్టులు,కొండలపై నివసించే వారు,గనులు,మైన్స్ వాటిలో పని చేసేవారు

వ్యక్తిగత ప్రమాద బీమా క్లెయిమ్ చేసే విధానం :
1 మొట్ట మొదటి సారిగా పాలసీ దారునికి అనుకొని ప్రమాదం ఏర్పడితే వెంటనే ఆయా బీమా సంస్థకు సమాచారం అందించాలి.
2) క్లెయిమ్ పారంలో మీ పాలసీ నెంబర్ ,ప్రమాదం జరిగిన ప్రదేశం, తేది,సమయం పేర్కొనాలి.
3) ప్రమాద నష్టం ఎలా జరిగిందో వివరించాలి.
4) వైద్య ధృవీకరణ పత్రం అవసరం
5) మెడిసిన్స్ బిల్లులు జతచేయాలి
6) కొన్ని ప్రమాదాలకు FIR నివేదిక అడగవచ్చు.
7) మరణం సంభవించినట్లయితే మరణ ధృవీకరణ పత్రం (DEATH CERTIFICATE)
8) పోస్ట్ మార్టం నివేదిక.

ముగింపు : తరచూ ప్రయాణాలు చేసే వారు ,ప్రమాదాకర వృత్తులు చేసేవారు కుటుంభములో ఒక్కరే సంపాదించే వారు తప్పనిసరి ప్రమాద బీమా కలిగి ఉండాలి. ప్రమాద బీమా ఎంచుకొనే ముందు అందులోనున్న నియమ నిబంధనలను తప్పకుండ అర్ధం చేసుకొని మీ ఆర్ధిక అవసరాలకు సరిపడే పాలసీని ఎంచుకోవాలి. క్లెయిమ్స్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు చెయ్యని బీమా సంస్థలో మాత్రమే పాలసీ కొనిగొలు చెయ్యాలి.

share

Leave a Comment