జీవిత బీమా అంటే ఏమిటి ? జీవిత బీమా రకాలు వివరించండి ? -

జీవిత బీమా అంటే ఏమిటి ? జీవిత బీమా రకాలు వివరించండి ?

share

పరిచయం :

మనం మన స్నేహితులు లేదా బంధువుల దగ్గర తరచుగా లైఫ్ ఇన్సురెన్సు లేదా జీవిత బీమా టాపిక్ ని వింటుంటాం.బంధువుల్లో ఎవరన్నా కాలం చేసిన పాలసీ చేశాడా లేదా అని అరా తీస్తారు? జీవితం అనేది శాశ్వతం కాదు కావున మనకంటూ ఒక బీమా పాలసీ తప్పనిసరి అని చెపుతువుంటారు అవునా కదా? కావున అసలు ఈ జీవిత బీమా అంటే ఏమిటి ? జీవిత బీమాలో ఎన్ని రకాల ఉంటాయి వాటిని గురించి తెల్సుకుందాం ?

జీవిత బీమా అంటే ఏమిటి ?

జీవిత బీమా అనేది ఒక వ్యక్తి మరియు జీవిత బీమా సంస్థ మధ్య జరిగే ఒక ఒప్పందం.అందుకు గాను బీమా సంస్థకు పాలసీదారుడు ప్రీమియం చెల్లిస్తాడు. అందుకు ప్రతిఫలంగా బీమా సంస్థ పాలసీదారుడు ఎంచుకున్నపాలసీ ప్రయోజనాలకు హామీ ఇస్తుంది.భారత ప్రభుత్వ మద్దతుతో బీమా సంస్థలన్నింటిని నియంత్రించే భారతీయ బీమా ప్రాధికార సంస్థ (IRDAI )కలదు. జీవిత బీమాలో  మరణ ప్రయోజనాలతో పాటు పొదుపు,పెట్టుబడి పథకాలు, పిల్లల చదువుల నిమిత్తం చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ,రిటైర్మెంట్ ప్లాన్స్ లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని గురించి  ఒక్కక్కటిగా సంపూర్ణగా తెల్సుకుందాం.

జీవిత బీమా ఎన్ని రకాలు :

సాధారణంగా జీవిత బీమాను  రెండు రకాలుగా విభజించవచ్చు

1) మరణ ప్రయోజనంతో కూడిన జీవిత బీమా ఒకటైతే

2) మరణ ప్రయోజనాలతో పాటు పొదుపు,పెట్టుబడి ప్రణాళికలతో కూడిన జీవిత బీమా రెండోది. ఈ రెండిటి కలయికతో మొత్తంగా భారత దేశంలో (8  ) రకాల పాలసీలు కలవు వీటిని గురించి పూర్తిగా తెల్సుకుందాం.

1 టర్మ్ ఇన్సురెన్స్

జీవిత బీమా పాలసీలన్నింటిలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాథమికమైనది. ఇందులో 3 రకాల పాలసీలు ఉన్నాయి. ఈ పాలసీల  ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణను అందిస్తుంది. అందుకే వీటిని  “ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్స్ ” అంటారు. పాలసీ వ్యవధిలో బీమాదారుడు అకాల మరణం చెందినట్లయితే మరణ ప్రయోజనాలను అందిస్తుంది. టర్మ్ పాలసీలలో పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం ఈ పాలసీలో ఎటువంటి ప్రయోజనాలను పొందలేడు, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోళ్లు పెంచడం కోసం వివిధ రకాల పాలసీలు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే అయితే కొన్ని రైడర్లు ఎంచుకోవడం వల్ల క్రిటికల్ ఇల్నెస్ యాక్సిడెంట్ డిజబులిటీ,టెర్మినల్ ఇల్ నెస్ ,హాస్పిటల్ క్యాష్ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు.

ఇప్పుడు 3 రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ల గురించి మాట్లాడుకుందాం

1 ఫ్యూర్ టర్మ్ పాలసీ : మిగతా రెండు టర్మ్ పాలసీలతో పోల్చుకుంటే ఈ  పాలసీలో  ప్రీమియం తక్కువగా ఉంది ఎక్కువ కవరేజ్ లభించడం జరుగుతుంది. ఒక నిర్దిష్ట కాలం వరకు పాలసీదారునికి జీవిత బీమా రక్షణ కల్పిస్తుంది. పాలసీ మధ్యలో కానీ పాలసీ ముగిసిన అనంతరం కానీ ఎటువంటి ప్రయోజనాలు అందించదు. మొత్తంగా చెప్పాలంటే మరణ ప్రయోజనం తప్ప ఇందులో ఎటువంటి ఇతర ప్రయోజనానాలు లెవ్వు.

2 టర్మ్ రిటర్న్ పాలసీ (TROP): అనగా టర్మ్ ఇన్సూరెన్స్ లాగే పాలసీదారుడు అకాల మరణానికి గురైనప్పుడు మరణ ప్రయోజనంతో పాటు రైడర్ ప్రయోజనాలను పొందుతాడు కాకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ కి దీనికి గల తేడా ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో పాలసీదారుడు పాలసీ టర్మ్ మొత్తం జీవించి ఉన్నట్లయితే  ప్రీమియం తిరిగి పొందలేదు  ,కానీ ఇందులో పాలసీ టర్మ్ ముగిసిన వెంటనే మొత్తం ప్రీమియం తిరిగి పాలసీదారుడుకి మెచ్యూరిటీ రూపంలో చెల్లించబడుతుంది. అందుకోసం ఈ పాలసీలు అధిక ప్రీమియంలు వాసులు చెయ్యటం జరుగుతుంది.

3 జీరో కాస్ట్ టర్మ్ పాలసీ: బీమా కంపినీలు కొత్తగా ”జీరో కాస్ట్” టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావటం జరిగింది.ఈ పాలసీలో రిస్క్ జరిగితే మరణ ప్రయోజనం, ఒకవేళ ఎటువంటి రిస్క్ జరగని సందర్భంలో పాలసీ గడువుకు ముందే పాలసీ నుండి వైదొలిగితే పాలసీ కోసం కట్టిన ప్రీమియంలన్ని తిరిగి పాలసీదారునికి చెల్లించబడుతాయి.

2 యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ (ULIP) : 

ULIP అనగా – యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్సు పాలసీ అని అర్ధం.దీంట్లో ఒకవైపు జీవిత బీమా రక్షణ మరియు పెట్టుబడి అనే రెండు ప్రయోజనాల కోసం ఇందులో పెట్టుబడికి ఆస్కారం ఉంది.యూలిప్ లో ప్రీమియం రూపంలో మనం పెడుతున్నపెట్టుబడుల్లో కొంత భాగాన్ని జీవిత బీమా కవరేజ్ కోసం మరి కొంత భాగం మార్కెట్ లింక్డ్ పెట్టుబడుల్లో పెట్టుబడిగ పెడుతారు. యూలిప్ పెట్టుబడుల్లో ఒకవైపు జీవిత బీమా కవరేజీతో మన కుటుంబానికి రక్షణ కలిపిస్తూ మరోవైపు లాభాలు వచ్చే పెట్టుబడుల్లో పెట్టడం జరుగుతుంది  ఈవిధంగా ఒకవైపు జీవిత బీమా ఇంకో వైపు పెట్టుబడిగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు పనిచేస్తాయి.

జీవిత బీమా మరియు పెట్టుబడులు అనే రెండు ప్రయోజనాలకోసం చూస్తున్న పాలసీదారులను యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు సరిగ్గా సరిపోతాయి. యులిప్ పెట్టుబడులు మార్కెట్ పనితీరు అధారంగా ప్రతిఫలాన్ని అందిస్తాయి.కొంతవరకు రిస్క్ తీసుకునే పాలసీదారులు ఈ పాలసీని ఎంచుకోవాలి .రిస్క్ వద్దు అనుకొనే వారు గ్యారెంటీ రిటర్న్స్ పాలసీలు లేదా ఎండోమెంట్ పాలసీలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

3 హోల్ లైఫ్ ఇన్సూరెన్స్

పాలసీ పేరుకు తగ్గట్టే పాలసీదారుడు జీవించి ఉన్నంతకాలం పాలసీ ప్రయోజనాలను పొందుతాడు అలాగే ఈ పాలసీలో జీవిత బీమా రక్షణతో పాటు పొదుపు పెట్టుబడి ప్రయోజనాలను కలిగి ఉంటుంది అలాగే పాలసీదారుడు కొంత కాల పరిమితి తర్వాత తాను కట్టిన ప్రీమియంలపై రుణం పొందే అవకాశం ఉంటుంది.అలాగే తక్షణం ఎటువంటి ఆర్ధిక అవసరాలు లేని పాలసీదారులు తాము మరణించిన తర్వాత వారి కుటుంబానికి ఒక ఆస్థి లాగా సంపదను సృష్టించాలని వారికి ఈ ఉపయోగ పడుతుంది. జీవిత బీమా పాలసీలన్నింటిలో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అత్యధిక కాలం పాటు లైఫ్ కవర్ అందిచే పాలసీ. అందుకే దీన్ని సంపూర్ణ జీవిత బీమా పాలసీ అంటారు. ఈ పాలసీలో లైఫ్ కవర్ తో పాటు ,పొదుపు ,పెట్టుబడి ప్రయోజనాలు కలవు.ఎక్కువ కాలం జీవిత బీమా కవరేజ్ తో పాటు తమ కుటుంభం సభ్యులకు భవిషత్ తరాలకు ఆర్ధిక మద్దతు కోసం ఈ పాలసీ ఉపయోగ పడుతుంది.

4 ఎండోమెంట్ ఇన్సూరెన్స్ పాలసీ: 

జీవిత బీమాలో భాగంగా ఒక రకమైన పాలసీనే ఎండోమెంట్ పాలసీ. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపదను సృష్టించాలనుకొనే వారికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది. భవిషత్ లో మీ ఆర్ధిక లక్ష్యాలైన ఇంటి నిర్మాణం లేదా మీ పిల్లల ఉన్నత చదువులు లేదా వివాహం పదవి విరమణ లాంటి లక్ష్యాలకు ఈ పాలసీ ఉపయోగ పడుతుంది. జీవిత బీమా మరియు పొదుపు అనే ద్వంద ప్రయోజనాల కోసం ఎండోమెంట్ పాలసీ ఏర్పడింది అని చెప్పవచ్చు.ఎండోమెంట్ పాలసీలో జీవిత బీమా కవరేజ్ తో పాటు మెచూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి. పాలసీదారుడు దురదుష్టవశాత్తు అకాల మరణం చెందితే బీమా కవరేజ్ మొత్తం వారి నామినికి అందించి వారి కుటుంబానికి అండగా ఉంటుంది, పాలసీ పూర్తికాలం జీవించి ఉన్నట్లయితే మెచూరిటీ ప్రయోజనాలు పొందుతాడు. ధీర్ఘకాలిక లక్షలైనా ఇంటి నిర్మాణం,పిల్లల చదువులు,లేదా వివాహానికి అవసరమైన నిధుల కోసం ఈ ప్రణాళిక ఉపయోగపడుతుంది.

5 మనీ బ్యాక్ పాలసీ:

మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీలో జీవిత బీమా,పోదుపు ,పెట్టుబడి అనే మూడు ప్రయోజనాలు కలవు.పాలసీ కోసం పాలసీదారుడు ఎంచుకున్న ప్రీమియం చెల్లింపు విధానాన్ని బట్టి పొదుపులు సమకూరుతాయి అలాగే పొదుపులు పెట్టుబడిగా మారి మెచూరిటీ సమయంలో పెట్టుబడికి అదనంగా రాబడులు చెల్లించబడుతాయి. అలాగే పాలసీదారుడు అకాల మరణం చెందితే జీవిత బీమా కవరేజ్ వారి నామినికి లేదా వారి కుటుంబానికి ఒకే మొత్తంలో చెల్లించబడుతుంది. మనీ బ్యాక్ పాలసీ పేరుకు తగ్గట్టే పాలసీ వ్యవధిలో మనం ప్రీమియం  రూపంలో కట్టిన పొదుపులను విడుతల వారీగా తిరిగి పొందే సౌకర్యం ఉండటం చేత  ఈ పాలసీలను మనీ బ్యాక్ పాలసీలు అంటారు . అలాగే  పొదుపులకు రాబడులతో పాటు జీవిత బీమా కవరేజీ మనీ బ్యాక్ పాలసీలో అదనపు ప్రయోజనాలుగా చెప్పవచ్చు.

 6 రిటైర్మెంట్ పెన్షన్ పాలసీ: 

పెన్షన్ ప్లాన్ ని రిటైర్మెంట్ ప్లాన్ అని కూడా అంటారు.పదవి విరమణ అనంతర జీవితం సాఫీగా సాగటం కోసం పెట్టె పెట్టుబడినే  పెన్షన్ ప్లాన్స్ అంటారు.అంటే మీరు పనిచేయని సమయంలో మీ మనుగడ కోసం ఇప్పటి నుండే పొదుపు మరియు పెట్టుబడి పెట్టడం అన్నమాట.పదవి విరమణ ప్రణాళికల  ఏర్పాటుకు ముందే ప్రస్తుత మీ జీవన శైలి ,భవిషత్తులో మీరు రిటైర్ కాబోయే సంవత్సరం ,ఆర్ధిక బాధ్యతలు  ,వైద్య పరమైన  అవసరాలు  లాంటి అంశాలు  పరిగణలోకి తీసుకొని ప్రణాళికలు  రూపొందించుకోవాలి. పాలసీదారుడు పదవి విరమణ అనంతరం స్థిరమైన మరియు విశ్వసనీయమైన నెలవారి చెల్లింపులు ఈ పాలసీ ద్వారా అందించబడుతుంది. ఈ పాలసీలో కూడా మరణ ప్రయోజనంతో పాటు నెల నెల పింఛన్ రూపంలో పాలసీదారుడికి అందిస్తూ, తను వృద్ధాప్యంలో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది తద్వారా పదవి విరమణ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడానికి తోడ్పడుతుంది.

 7 చైల్డ్ ఎడ్యుకేషన్ పాలసీ:

మీ పిల్లల ఆర్ధిక భవిష్యత్ భద్రపరచడం కోసం వారి విద్య ,వైద్యం ఉన్నత చదువులు  విదేశీ ప్రయాణాలకు వారి తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టె పథకాలే చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ పాలసీలు.తల్లిదండ్రులు అకాల మరణం సంభవించిన వారి పిల్లల భవిష్యత్ కోసం సురక్షితంగా ఉండటం కోసం ఈ పాలసీలు తోడ్పడుతాయి.వారు లేని సమయంలో వారి పోషణ విద్య అవసరాలు ట్యూషన్ ఫీజులు కోసం నెలనెల వారి పిల్లలకు చెల్లించడమే కాకూండా జీవిత బీమా కవరేజ్ అందించి వారికి అండగా ఉంటుంది. చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ట్రిపుల్ బెనిఫిట్ అనే అద్భుత ప్రయోజనం కలదు పాలసీదారుడు మరణించిన యెడల లైఫ్ కవరేజీ అందించడమే కాకూండా ఆ తర్వాత ప్రీమియం లంను ఆ బీమా సంస్థనే చెల్లించి చివరికి మెచూరిటీ ప్రయోజనాలు అందిస్తుంది.ఈ మధ్య కాలంలో పిల్లల చదువులకు అయ్యే ఖర్చులకు నెల నెల చెల్లింపులు అందించబడుతాయి.

8 గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ:

ఈ పాలసీ సమూహానికి లేదా ముఖ్యంగా కంపెనీ ఉద్యోగులకు జీవిత బీమాను మరియు వారి కుటుంబానికి  ఆర్థిక భద్రత కోసం కల్పించడం జరిగింది.ఈ పాలసీ సమూహానికి లేదా ముఖ్యంగా కంపెనీ ఉద్యోగులకు జీవిత బీమాను ఒక గ్రూప్ గా లేదా సమూహముగా అందించి సమూహ సభ్యులలో ఎవరికి ఆపద వచ్చిన వారికీ జీవిత బీమా కవర్ తో పాటు ఆర్థిక భద్రత కోసం ఈ పాలసీలు ఏర్పాటు చేయటం జరిగింది.

పైన పేర్కొన్న జీవిత బీమా రకాల్లో ఏ ఒక్కరి అవసరాలు ఇంకో వ్యక్తి అవసరాలకు సరిపోవు,ఒక్కో వ్యక్తి అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి.కావున ఈ రకమైన జీవిత బీమా  పాలసీలన్నింటిలో తమ తమ వ్యక్తిగత అవసరాలకు తగ్గ  పాలసీని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈవిధంగా జీవిత బీమాలో  మరణ ప్రయోజనమే కాకుండా అనేక రకాల ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఈ  ప్రయోజనాల దృష్ట్యా ప్రతి వ్యక్తికి  బీమా తప్పనిసరి అని తెలుస్తుంది ?.అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన భారత దేశంలో జీవిత బీమా కలిగి ఉన్న వారి సంఖ్య చాలా తక్కువ,అందుకు మన దేశ వెనుకబాటుతనం,నిరక్షరాస్యత, ఆదాయ స్థాయిలు కారణాలు చెప్పవచ్చు.అందుకోసం భారత ప్రభుత్వం జీవిత బీమాను ఎంకరేజ్ చెయ్యటం కోసం వివిధ రకాల పన్ను ప్రయోజనాలు అందిస్తుంది.జీవిత బీమా  కోసం చెల్లించే ప్రీమియంలకు మరియు క్లెయిమ్ సమయంలో వచ్చే లైఫ్ కవర్ ప్రయోజనాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. బేస్ ప్లాన్ కోసం చెల్లించే ప్రీమియంలకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 (C ) కింద సంవత్సరానికి 1.5 లక్షలు వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే క్రిటికల్ ఇల్ నెస్ కోసం చెల్లించే ప్రీమియంలు సెక్షన్ 80 D కింద పన్ను మినహాయింపు  అలాగే మెచూరిటీ సమయంలో వచ్చే ఆదాయంలో సెక్షన్ 10(10D ) కింద  పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది.

ముగింపు: పైన వివరించిన వ్యాసంలో జీవిత బీమా అంటే ఏమిటి జీవిత బీమా రకాలను గురించి వివరించడం జరిగింది. జీవిత బీమా ఎంపికలో పాలసీదార్ల వ్యక్తిగత అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గ పాలసీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.అలాగే జీవిత బీమా సంస్థ ఎంపిక కూడా ముక్యమైనది.ఎందుకంటే భవిషత్లో ఏదేని ప్రమాదం సంభవిస్తే క్లెయిమ్స్ కోసం మీ కుటుంభ సభ్యులు ఇబ్బందికి గురికాకుండా ఉండటం కోసం ఇప్పుడే జాగ్రత్తలు తీస్కొని మంచి బీమా సంస్థను ఎంపిక చేసుకోవాలి.

share

Leave a Comment